Wednesday, February 1, 2012

ఉరుములు నీ మువ్వలై మెరుపులు నీ నవ్వులై
తొలకరి మేఘానివై రా అలివేణి
పరుగులు నీ గానమై తరగలు నీ తాళమై
చిలిపిగా చిందాడవే కిన్నెరసాని
కాలానికే కాలాడక ఆగాలి నువ్వు ఆడే వేళ
అది చూడగా మనసాగక ఆడాలి నీతో నింగి నేల
తకధిమి తాళాలపై తళుకుల తరంగమై
చిలిపిగా చిందాడవే కిన్నెరసాని
మెలికల మందాకిని కులుకుల బృందావని
కనులకు విందియ్యవే ఆ అందాన్ని

చంద్రుళ్లో కుందేలే మా ఇంట ఉందంటూ మురిసింది ఈ ముంగిలి
చిందాడే కిరణంలా మా ముందు నువ్వుంటే ప్రతిపూట దీపావళి
మా కళ్ళలో వెలిగించవే సిరివెన్నెల
మా ఆశలే నీ అందెలై ఈ మంచు మౌనం మోగే వేళ
ఆ సందడే ఆనందమై ప్రేమించు ప్రాణం పాడే వేళ

ఉరుములు నీ మువ్వలై మెరుపులు నీ నవ్వులై
తొలకరి మేఘానివై రా కళ్యాణి
తకధిమి తాళాలపై తళుకుల తరంగమై
చిలిపిగా చిందాడవే కిన్నెరసాని

నడయాడే నీ పాదం నటవేదమేనంటూ ఈ పుడమే పులకించగా
నీ పెదవే తన కోసం అనువైన కొలువంటూ సంగీతం నిను చేరగా
మా గుండెనే శృతి చేయవా నీ వీణలా
ఈ గాలిలో నీ కేళితో రాగాలు ఎన్నో రేగే వేళ
నీ మేనిలో హరివిల్లునే వర్ణాల వానై సాగే వేళ

ఉరుములు నీ మువ్వలై మెరుపులు నీ నవ్వులై
తొలకరి మేఘానివై రా అలివేణి
తకధిమి తాళాలపై తళుకుల తరంగమై
చిలిపిగా చిందాడవే కిన్నెరసాని

No comments: